ఎయిరిండియా ఎయిర్‌హోస్టెస్ మృతి చెందిన ఉదంతం గురుగ్రామ్‌లో సోమవారం వెలుగు చూసింది. డిఎల్‌ఎఫ్ ఫేజ్ 1లో స్నేహితుడిని కలవడానికి వచ్చిన ఎయిర్ హోస్టెస్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మరణించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళను 25 ఏళ్ల సిమ్రాన్ దద్వాల్‌గా గుర్తించారు. ఆమె పంజాబ్‌లోని మొహాలి నివాసి. ఎయిర్ ఇండియాలో పనిచేసింది. ఆమె శనివారం రాత్రి గురుగ్రామ్‌లోని తన స్నేహితురాలు నితిక అనే స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కడ పలువురు స్నేహితులు కూడా ఉన్నారు. అర్థరాత్రి మద్యపానం తర్వాత అందరూ నిద్రపోయారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో దద్వాల్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చి తన స్నేహితులకు సమాచారం అందించింది. దీంతో సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తమ అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారని, విసెరా శాంపిల్‌ను పరీక్ష నిమిత్తం మధుబన్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోందని, విసెరా నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.