టూరిస్టు బస్సు బోల్తా.. ఆరుగురి మృతి.. 40 మందికి పైగా గాయాలు

Horrific bus accident leaves 6 dead 42 injured at Kalinga Ghat in Odisha.ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 May 2022 11:29 AM IST
టూరిస్టు బస్సు బోల్తా.. ఆరుగురి మృతి.. 40 మందికి పైగా గాయాలు

ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గంజాం జిల్లాలోని భంజానగర్ పోలీసు పరిధిలోని దుర్గాప్రసాద్ గ్రామ సమీపంలోని కళింగ ఘాట్ వద్ద టూరిస్ట్ బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మ‌ర‌ణించ‌గా.. మ‌రో 42 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు.

అందుతున్న స‌మాచారం మేర‌కు కంధమాల్‌లోని దరింగ్‌బాడి నుండి భంజానగర్ మీదుగా విశాఖపట్నం వెళుతుండగా బుధ‌వారం తెల్ల‌వారుజామున బ‌స్సు బ్రేక్ ఫెయిల్ అవ్వ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 70 మందికి పైగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న భంజానగర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు టికబాలి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం భంజానగర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఘ‌ట‌నాస్థ‌లంలోనే ఐదుగురు మృతి చెంద‌గా, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రొక‌రు ప్రాణాలు కోల్పోయారు. గాయ‌ప‌డిన వారిలో 14 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. క్ష‌త‌గాత్రుల్లో ఎక్కువ‌ మంది మ‌హిళ‌లు, పిల్ల‌లు ఉన్నారు.

కాగా.. వీరంతా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా ఉదయనారాయణపూర్ సబ్ డివిజన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు టూరిస్ట్ బస్సులో కంధమాల్‌లోని దరింగ్‌బడికి వెళ్లారు. అక్క‌డి నుంచి విశాఖ‌ప‌ట్నం వెలుతుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. కాగా.. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదుచేసిన భంజాన‌గ‌ర్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story