సరూర్‌నగర్‌లో పరువు హత్య.. భార్య కళ్లెదుటే భర్తను చంపేశారు
Honor killing in Saroornagar.కాలం మారుతోంది. సమాజం మారుతోంది. అయినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 5 May 2022 9:29 AM ISTకాలం మారుతోంది. సమాజం మారుతోంది. అయినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. కులం, పరువు మాత్రమే ముఖ్యమని అనుకుంటున్నారు. కుమారై ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో.. ఆమెను అంతం చేయడమో, లేక ఆమెను పెళ్లి చేసుకున్న అతడిని హత్య చేయడమో చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరిని హతమారుస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పరువు హత్య చోటు చేసుకుంది. పెద్దలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకుందని.. ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమె భర్తపై మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన నాగరాజు(25), పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ అశ్రిన్ సుల్తానాలు ఒకే కళాశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలో ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఆశ్రిన్ ఇంట్లో తెలిసింది. వీరిద్దరి ప్రేమకు వారు ఒప్పుకోలేదు. తమ కుమారైకు దూరంగా ఉండాలంటూ నాగరాజును హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఓల్డ్ సిటీలోని లాల్‌దర్వాజలోని ఆర్యసమాజ్‌లో జనవరి 31న నాగరాజు, ఆశ్రిన్‌లు పెళ్లి చేసుకున్నారు. సరూర్ నగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. నాగరాజు మలక్‌పేటలో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇక వీరు హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలుసుకున్న ఆశ్రిన్ సోదరుడు రెక్కీ నిర్వహించాడు. వీరు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించాడు. బుధవారం రాత్ర 9 గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్‌పై వీఎం హోం నుంచి సరూర్‌నగర్ పోస్టాఫీస్ వైపు వెలుతుండగా.. ఆశ్రిన్ సోదరుడు, అతడి స్నేహితుడు బైక్‌పై వారిని వెంబడించి దాడికి పాల్పడ్డాడు. నాగరాజును ఇనుపరాడ్‌తో కొట్టి హతమార్చాడు.
తన కళ్లెదుటే భర్తను చనిపోవడంతో ఆశ్రిన్ గుండెలు బద్ధలయ్యేలా రోదించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆశ్రిన్ సోదరుడి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.