ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో హారన్ మోగించడంపై జరిగిన వివాదం తర్వాత తన SUVతో సెక్యూరిటీ గార్డుపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి 24 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ సంఘటన ఆదివారం నాడు మహిపాల్‌పూర్ సమీపంలో జరిగింది. ఐజిఐ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బాధితుడు రాజీవ్ కుమార్ తన షిఫ్ట్ పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
కుమార్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, థార్ వాహనం నడుపుతున్న వ్యక్తి బిగ్గరగా హారన్ మోగించడం ప్రారంభించాడు. హారన్ కొట్టడం ఆపమని కుమార్ కోరినప్పుడు వాహనం నడుపుతున్న వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొన్ని క్షణాల తర్వాత, కుమార్ రోడ్డు దాటుతున్నప్పుడు తన వాహనాన్ని వేగంగా నడిపి కుమార్ ని ఢీకొట్టాడు. కుమార్ కిందకు పడిపోగా, కారు మీద నుండి పోనిచ్చాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
బీహార్‌కు చెందిన కుమార్ తన కుటుంబంతో కలిసి మహిపాల్‌పూర్‌లో నివసిస్తున్నాడు, అతని రెండు కాళ్లలో 10 చోట్లకు పైగా ఎముకలు విరిగిపోయాయని పోలీసులు తెలిపారు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కుమార్ వాంగ్మూలం ఆధారంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రంగ్‌పురి నివాసి విజయ్ అలియాస్ లాలాగా గుర్తించిన నిందితుడిని సంఘటన జరిగిన ఆరు గంటల్లోనే అరెస్టు చేశారు.