ఒక ఎయిర్ హోస్టెస్ వెంటిలేటర్‌లో ఉన్నప్పుడు ఆమెను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో గురుగ్రామ్ ఆసుపత్రి టెక్నీషియన్ ను అరెస్టు చేశారు. నిందితుడు గత ఐదు నెలలుగా ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 14న ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా, సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
ఎయిర్‌లైన్ శిక్షణ కోసం గురుగ్రామ్‌కు వెళ్లిన ఆ మహిళ తాను బస చేసిన హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోయిన సంఘటన తర్వాత అనారోగ్యానికి గురైంది. ఆమెను మొదట అత్యవసర చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఆమె భర్త ఆమెను ఏప్రిల్ 6న సదర్ ప్రాంతంలోని మరొక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెపై లైంగిక దాడి జరిగింది.
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. ఆ మహిళ తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆసుపత్రి సిబ్బంది తనను అనుచితంగా తాకినట్లు భావించానని, కానీ తన పరిస్థితి విషమంగా ఉండటంతో కదలలేకపోయానని తనను తాను రక్షించుకోలేకపోయానని చెప్పింది. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితులను గుర్తించడానికి ఎనిమిది పోలీసు బృందాలను నియమించారు. పోలీసులు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 800 కి పైగా సిసిటివి కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. సమగ్ర దర్యాప్తు తర్వాత, నిందితుడిని గుర్తించి ఏప్రిల్ 18న సదర్ ప్రాంతం నుండి అరెస్టు చేశారు. నిందితుడిని 25 ఏళ్ల దీపక్‌గా గుర్తించారు. అతను ఐసియు విభాగంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.