పులివెందులలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
Gun Fire at Pulivendula. పులివెందులలో భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులకు దిగాడు.
By Medi SamratPublished on : 28 March 2023 6:15 PM IST

Gun Fire at Pulivendula
పులివెందులలో భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన దిలీప్‌ను కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మహబూబ్ బాషా పులివెందులలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భరత్ కుమార్ యాదవ్, పులివెందుల పట్టణంలోని గొర్రెల వ్యాపారి దిలీప్ మధ్య ఆర్థికలావాదేవీలు ఉన్నాయి. ఇద్దరూ డబ్బుల విషయంలో గొడవపడుతున్నట్టు సమాచారం. పులివెందులలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఈరోజు మధ్యాహ్నం ఇద్దరూ తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగారు. హుటాహుటిన ఇంట్లోకి వెళ్లి భరత్‌కుమార్ యాదవ్ తనవద్ద ఉన్న తుపాకీతో దిలీప్ ఛాతిపై కాల్పులు జరిపాడు. దిలీప్ స్నేహితుడు మహబూబ్ బాషా అడ్డుకొనే ప్రయత్నం చేయగా.. అతడిపైనా కాల్పులు జరిపాడు. గాయాలతో వీరిద్దరూ ఆలయం మెట్ల వద్ద కింద పడిపోవడంతో భరత్‌కుమార్ యాదవ్ అక్కడి నుంచి తుపాకీతో పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో బాధితులను చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దిలీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కాల్పులు జరిపిన భారత్ కుమార్ యాదవ్ వివేకా హత్య కేసులో గతంలో సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. భరత్ కుమార్ యాదవ్ వివేకా హత్య కేసు నిందితుల్లో ఒకరైన సునీల్ కుమార్ బంధువు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story