ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడన్న ఆరోపణలపై గుజరాత్ పోలీసులు 28 ఏళ్ల యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిసాగర్ జిల్లాలోని దేబార్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి 2019 నవంబర్‌లో ఆనంద్ జిల్లాలోని ఉమ్రేత్ తాలూకాకు చెందిన 27 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో.. మహిళను భర్త ఇంటి నుంచి గెంటేశాడు. ఆ మహిళ తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చి అక్కడ నివసించడం ప్రారంభించిందని పోలీసులు ఒక నివేదిక ద్వారా తెలిపారు.
సబ్-ఇన్‌స్పెక్టర్ చేతన్‌సిన్హ్ రాథోడ్ మాట్లాడుతూ " జూలైలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు, బాధితురాలు అత్తారింటిని వదిలి వెళ్ళవలసి వచ్చినప్పుడు భర్త కూడా ట్రిపుల్ తలాక్ చెప్పాడు..."అని వెల్లడించారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం గురించి తనకు తెలియదని, అందుకే అప్పుడు ఫిర్యాదు చేయలేదని మహిళ పోలీసులకు తెలిపింది. ఆ మహిళ తన భర్త కార్యకలాపాలను చూసేందుకు సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసిందని పోలీసులు తెలిపారు. "ఇటీవల, ఆమె తన భర్త కార్యకలాపాలను తనిఖీ చేయాలని కోరుకుంది. నకిలీ పేరుతో సోషల్ మీడియా ఖాతాను సృష్టించింది. అయితే, ఆ ఖాతా వెనుక భార్య ఉందని భర్త గుర్తించాడు. అతను సోషల్ మీడియాలో మళ్లీ ట్రిపుల్ తలాక్ చెప్పాడు," అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మహిళ కుటుంబసభ్యులకు సమాచారం అందించి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.