పొలంలో క్షుద్రపూజలు.. చివరికి ఆ జంట ఏమయ్యారంటే..?

Gujarat couple behead themselves using guillotine-like device for human sacrifice ritual. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని వింఛియా గ్రామంలో ఒక వ్యక్తి, అతని భార్య తమ పొలంలో ఆత్మహత్య చేసుకున్నారు

By M.S.R  Published on  17 April 2023 4:41 PM IST
పొలంలో క్షుద్రపూజలు.. చివరికి ఆ జంట ఏమయ్యారంటే..?

ప్ర‌తీకాత్మ‌క చిత్రం



గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని వింఛియా గ్రామంలో ఒక వ్యక్తి, అతని భార్య తమ పొలంలో ఆత్మహత్య చేసుకున్నారు. అది కూడా శిరచ్ఛేదం చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హేముభాయ్ మక్వానా (38), అతని భార్య హన్సాబెన్ (35) దంపతులు తమ తలలను నరుక్కున్నారు. వించియా పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ ఇంద్రజిత్‌సిన్హ్ జడేజా మాట్లాడుతూ వారు తమ తలలు అగ్నిలో పడేలా చేశారని.. అందుకోసం ప్రత్యేకంగా ఓ పరికరాన్ని ఉపయోగించారని తెలిపారు.

తరచూ తాంత్రిక పూజలు చేసే ఈ జంట.. తమ పొలంలో ఓ గుడిసెను నిర్మించుకున్నారు. అందులో హోమాన్ని ఏర్పాటు చేసి తలలు అందులో పడే విధంగా గిలెటిన్ లాంటి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా తలలు, శరీరాలు వేరుపడి కనిపించాయి. సంఘటన స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

దంపతులు మొదట తమ తలలను తాడుతో పట్టుకుని యంత్రం కింద తలలు పెట్టారు. వారు తాడును విడిచిపెట్టిన వెంటనే ఇనుప బ్లేడ్ వారిపై నేరుగా పడి తలలు తెగాయి. అనంతరం అవి నేరుగా మంటల్లోకి పడిపోయాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు దంపతులు పూజలు చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా వీరిద్దరూ ప్రతిరోజూ గుడిసెలో పూజలు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సూసైడ్‌ నోట్‌లో పిల్లలు, తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చేసుకోవాలని బంధువులను కోరారు.


Next Story