డ్రైవ‌ర్‌కు గుండెపోటు.. అదుపుత‌ప్పి కారును ఢీ కొట్టిన బ‌స్సు.. 9 మంది మృతి

Gujarat Bus Crashes Into SUV After Driver Suffers Heart Attack 9 Dead.గుజ‌రాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2022 4:18 AM GMT
డ్రైవ‌ర్‌కు గుండెపోటు.. అదుపుత‌ప్పి కారును ఢీ కొట్టిన బ‌స్సు.. 9 మంది మృతి

గుజ‌రాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. బ‌స్సు డ్రైవ‌ర్‌కు గుండెపోటు రావ‌డంతో బ‌స్సు కంట్రోల్ త‌ప్పి ఎదురుగా వ‌స్తున్న ఎస్‌యూవీ కారును ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది మ‌ర‌ణించారు. మ‌రో 28 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు.

సూరత్‌లో జరిగిన ప్రముఖ్‌ స్వామి మహరాజ్‌ మహోత్సవ్‌కు హాజరైన కొంద‌రు తిరిగి సొంతూళ్లకు లగ్జరీ బస్సులో వెలుతున్నారు. శ‌నివారం తెల్ల‌వారుజామున నవ్‌సారి జిల్లాలోని వెస్మా గ్రామ సమీపంలోకి వ‌చ్చేస‌రికి బ‌స్సు డ్రైవ‌ర్‌కు గుండెపోటు వ‌చ్చింది. దీంతో బ‌స్సు అత‌డి కంట్రోల్ త‌ప్పి ఎదురుగా వ‌స్తున్న ఎస్‌యూవీ కారును ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ఉన్న తొమ్మిది మందిలో ఎనిమిది మంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. బ‌స్సులో ఉన్న 28 మంది గాయ‌ప‌డ్డారు. వీరిని స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. అయితే.. బ‌స్సు డ్రైవ‌ర్ చికిత్స పొందుతూ క‌న్నుమూశాడు. దీంతో ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. క్ష‌త‌గాత్రుల్లో 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ‌గా వారిని ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

నవ్‌సారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రుషికేష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ల‌గ్జరీ బస్సు సూరత్ నుంచి వల్సాద్ వెలుతోంద‌న్నారు. ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న వారు గుజరాత్‌లోని అంక్లేశ్వర్ నివాసితులు, వారు వల్సాద్ నుండి తమ స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నారని, బస్సులోని ప్రయాణికులు వల్సాద్‌కు చెందిన వారని ఉపాధ్యాయ్ తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలియ‌జేశారు. "గుజరాత్‌లోని నవ్‌సారిలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ విషాదంలో కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. దేవుడు వారికి బాధను భరించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందిస్తోంది.," అని ఆయన గుజరాతీలో ట్వీట్ చేశారు.


Next Story