మంచూరియా తినలేదని.. అమ్మమ్మను చంపిన మనువడు.. 'దృశ్యం' స్టైల్లో ట్విస్టులు

Grandson who killed grandmother in Bengaluru arrested after six years. ఐదేళ్ల క్రితం బెంగళూరులో ఓ వృద్ధురాలి హత్య సంచలనం రేపింది. తాజాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

By అంజి  Published on  7 Oct 2022 10:26 AM GMT
మంచూరియా తినలేదని.. అమ్మమ్మను చంపిన మనువడు.. దృశ్యం స్టైల్లో ట్విస్టులు

ఐదేళ్ల క్రితం బెంగళూరులో ఓ వృద్ధురాలి హత్య సంచలనం రేపింది. తాజాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాని నిందితులిద్దరినీ మహారాష్ట్రలో అరెస్ట్‌ చేసి బెంగళూరు తీసుకొచ్చారు. నిందితులు సంజయ్​(26), శశికళ(46) తల్లీకొడుకులు. అమ్మమ్మను మనవడు సంజయ్‌.. మంచురియా తినలేదని ఆవేశంలో హత్య చేశాడు. ఆ తర్వాత తల్లి శశికళ సాయంతో మృతదేహాన్ని దాచిపెట్టి.. ఇన్నాళ్లకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శశికళ తన కుమారుడు సంజయ్‌, తల్లి శాంత కుమారితో కలిసి బెంగళూరులోని ఓ కాలనీలోని ఇంట్లో అద్దెకు ఉండేది.

సంజయ్‌.. ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాడు. 2016 సంవత్సరంలో ఒక రోజు కాలేజీ నుండి ఇంటికి తిరిగొస్తూ అమ్మమ్మ కోసం మంచురియా తీసుకొచ్చాడు. అది తినేందుకు అమ్మమ్మ శాంత కుమారి (69) నిరాకరించింది. ఆపై మంచురియాను మనుమడిపై విసిరికొట్టింది. కోపంతో సంజయ్‌ కిచెన్‌ రూంలో నుంచి ఓ వస్తువును అమ్మమ్మ తలపై బలంగా బాదాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అమ్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటి వేరే పనిలో ఉన్న తల్లి శశికళ.. కొడుకు చేసిన పని చూసి ఒక్కసారిగా షాకైంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ ఇవ్వాలనుకుంది.

అయితే కొడుకు సంజయ్‌.. వద్దని బతిమాలిడటంతో వెనక్కి తగ్గి ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచింది. ఈ క్రమంలోనే తల్లీకొడుకులు.. ఆ డేడ్‌బాడీని ఎలాగైనా మాయం చేయాలనుకున్నారు. సంజయ్​ తన ఫ్రెండ్‌ నందీశ్​ సాయం కోరాడు. అద్దె ఇంటి లోపల గోడ దగ్గర ఓ గొయ్యి తవ్వి, అక్కడ మృతదేహాన్ని పాతిపెట్టారు. ఎవరూ గుర్తుపట్టని విధంగా సిమెంట్‌ వేసి, ప్లాస్టరింగ్‌ చేసి, పెయింట్ వేశారు. ఆ తర్వాత నెమ్మదిగా అద్దె ఇంటి నుంచి జారుకున్నారు తల్లీకొడుకులు. 2017 మే 7న అద్దె ఇంటికి యజమాని మరమ్మతులు చేయిద్దామనుకున్నాడు.

ఈ క్రమంలోనే ఆ ఇంట్లోకి వెళ్లగా.. అక్కడ రక్తంతో తడిసిన చీర ఒకటి కనబడింది. చాలా రోజులుగా శాంత కుమారి కనిపించకపోవడం, తల్లీకొడుకులు మాయం కావడం వల్ల అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోడ బద్దలుకొట్టి చూడగా మృతదేహాం కనిపించింది. దీంతో అసలు విషయం బయటపడింది. ఈలోగా సంజయ్, శశికళ మహారాష్ట్రలోని కొల్హాపుర్​లో తలదాచుకున్నారు. అప్పటి నుంచి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు సాగించారు. చివరకు సంజయ్​, శశికళ కొల్హాపుర్​లో ఉన్నట్లు గుర్తించారు. గురువారం వారిని అరెస్టు చేశారు.

Next Story