ఆస్తిలో వాటా ఇవ్వనందుకే కత్తితో కసితీరా తాతను పొడిచా.. పోలీస్ విచారణలో కీర్తితేజ
తనను అవమానించినందుకే తాతను హత్య చేసినట్లు కీర్తితేజ ఒప్పుకున్నాడు
By Knakam Karthik Published on 18 Feb 2025 12:34 PM IST
ఆస్తిలో వాటా ఇవ్వనందుకే కత్తితో కసితీరా తాతను పొడిచా..పోలీస్ కస్టడీలో కీర్తితేజ జవాబులు
తాతను చంపిన కేసులో మనవడు కీర్తితేజ పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు కీర్తితేజను పోలీసులు విచారించారు. మొదటి రోజు పోలీసుల ప్రశ్నలకు మౌనంగా ఉన్న కీర్తి తేజ ఆ తర్వాత కీలక విషయాలు వెల్లడించాడు. తనను అవమానించినందుకే తాతను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ' యూ బెగ్గర్' అంటూ ప్రతీ రోజూ తాత జనార్ధనరావు అవమానించేవాడని.. ఏ రోజూ సొంత మనిషిగా చూడలేదని, కనీసం కుటంబ సభ్యుడిగా కూడా చూడలేదని కీర్తితేజ చెప్పాడు. అందరికంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని, ప్రతీ రోజూ బెగ్గర్ అంటూ పిలిచేవాడని చెప్పాడు. ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా అవమానించాడని పోలీసు కస్టడీలో కీర్తితేజ వెల్లడించాడు. అలా తిట్టడం వల్ల ఆఫీస్ స్టాప్ కూడా చిన్న చూపు చూసేవారని, ఆస్తి పంపకాలు, పదవుల కేటాయింపుల్లోనూ తక్కువ చేశాడని చెప్పాడు.
చివరకు డైరెక్టర్ పదవి కూడా రెండవ కుమార్తె కుమారుడికి ఇచ్చాడని కీర్తితేజ చెప్పాడు. అప్పటి నుంచి తాత జనార్ధనరావుకు, నాకు గొడవలు పెరిగాయి.. అని కీర్తితేజ పోలసు కస్టడీలో చెప్పాడు. అందుకే చంపేయాలని నిర్ణయించుకుని.. ఇన్‌స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేసినట్లు చెప్పాడు. మర్డర్ జరిగిన రోజు నాకు, తాతకు మధ్య పెద్ద గొడవ జరిగింది అని.. కీర్తి తేజ వెల్లడించాడు. ఆస్తిలో వాటా అడిగితే ఇవ్వను అన్నాడు. కోపంతో కత్తితో కసితీరా పొడిచా, హత్య చేసిన తర్వాత కత్తితో పాటు రక్తంతో ఉన్న బట్టలను ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో తగులబెట్టా..అని చెప్పాడు. కాగా బట్టలు తగలబెట్టేందుకు అమెజాన్‌లో బ్యుటేన్ గ్యాస్‌ను కీర్తితేజ ఆర్డర్ పెట్టినట్లు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్‌లో గుర్తించారు.
కాగా ఫిబ్రవరి 6వ తేదీన హైదరాబాద్ పంజాగుట్టలో పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావును సొంత మనువడు అతి కిరాతంగా హత్య చేశాడు. బేగంపేట భీమా జువెలర్స్ వద్ద ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురైనట్లు ఫోన్‌కాల్ రావడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే జనార్దనరావు రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జనార్దనరావుతో పాటు గాయాలైన కుమారై సరోజినిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.