కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెలుతున్న ట్రక్కు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెలగావిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోకాక్ తాలూకాలోని అక్కాతంగియార హలా గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు ఓ ట్రక్కులో బెలగావికి వెలుతున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం కనబరగి గ్రామానికి చేరుకునే సరికి డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రక్కు బళ్లారి కాలువలో పడిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాహంతో వాహనాన్ని నీళ్లలోంచి బయటకు తీశారు. అందులో చిక్కుకున్న వారిని కాపాడారు. ఈఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఎంబీ బోర లింగయ్య ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.