న్యూఇయర్ వేళ దారుణం.. యువతిని కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లడంతో..
Girl killed after car drags her for kilometres in Delhi, 5 arrested. న్యూ ఇయర్ వేళ దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. స్కూటీపై వెళ్తున్న 23 ఏళ్ల యువతిని
By అంజి Published on 2 Jan 2023 8:50 AM ISTన్యూ ఇయర్ వేళ దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. స్కూటీపై వెళ్తున్న 23 ఏళ్ల యువతిని కారు ఢీ కొట్టింది. అక్కడితో ఆగకుండా ఆ యువతిని నాలుగు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అప్పటికే తీవ్రగాయాలపాలైన మహిళ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున యువతి ప్రయాణిస్తున్న స్కూటీనీ కారు ఢీకొట్టింది. ఆ తర్వాత యువతిని కారుతో సుల్తాన్‌పురి నుండి ఢిల్లీలోని కంఝవాలా వరకు నాలుగు కిలోమీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లారు.
రోహిణి జిల్లాలోని కంఝవాల్ పోలీసులకు ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కుతుబ్‌గఢ్ వైపు వెళ్తున్న గ్రే రంగు బాలెనో కారు మహిళ మృతదేహాన్ని ఈడ్చుకెళ్తున్నట్లు కాల్ వచ్చిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి కారు నంబరు కూడా చెప్పాడు. దీంతో వెంటనే ఆ ప్రాంతంలోని చెక్‌పోస్టుల దగ్గర పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే అంతలోనే తెల్లవారుజామున 4 గంటలకు, మహిళ నగ్న మృతదేహం రోడ్డుపై పడి ఉందని కాంఝవాలా పోలీసులకు మరో కాల్ వచ్చింది. క్రైమ్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. నేరస్థలం నుండి నమూనాలు సేకరించడానికి ఫోరెన్సిక్స్ బృందాన్ని కూడా పిలిచారు. మృతదేహాన్ని మంగోల్‌పురిలోని ఎస్‌జీఎం ఆస్పత్రికి తరలించారు.
ఇంతలో ఢిల్లీ పోలీసులు కారు ట్రేస్ చేసి విచారణ చేపట్టారు. కారు యజమానిని గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ స్కూటర్‌ను వాహనం ఢీకొట్టామని, ఆ సమయంలో తాము కారులోనే ప్రయాణిస్తున్నట్లు ఐదుగురు వ్యక్తులు వెల్లడించారు. ప్రమాదం తరువాత, కారు యువతిని సుల్తాన్‌పురి నుండి కంఝవాలా ప్రాంతానికి సుమారు నాలుగు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో మహిళ బట్టలు చిరిగిపోయాయి. ఆమెకు తీవ్ర గాయాలు తగిలాయి. అవి చివరికి ఆమె మరణానికి దారితీశాయి.
నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పాడైపోయిన స్కూటర్‌ను గమనించాడు. తెల్లవారుజామున 3:53 గంటలకు పోలీసు స్టేషన్‌లో సమాచారం నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పెళ్లిళ్లు, ఇతరత్రా కార్యక్రమాల్లో పార్ట్‌టైమ్‌గా పనిచేసేది. ఆదివారం అలాంటి ఒక ఫంక్షన్‌కు హాజరైన ఆమె స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైంది. యువతికి ఆమె తల్లి, నలుగురు సోదరీమణులు, తొమ్మిది, 13 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు సోదరులు ఉన్నారు. బాధితురాలు తన కుటుంబంతో కలిసి అమన్ విహార్ ప్రాంతంలో నివసించేది.
అరెస్టయిన నిందితులను దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), క్రిషన్ (27), మిథున్ (26), మనోజ్ మిట్టల్ (27)లుగా గుర్తించారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నారో లేదో తనిఖీ చేయడానికి వారి నమూనాలను కూడా తీసుకున్నారు. తదుపరి విచారణ జరుగుతోంది. మరోవైపు, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ విషయాన్ని తెలుసుకుని, కమిషన్ ముందు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేశారు.
ఎఫ్‌ఐఆర్ కాపీ, ఈ కేసులో అరెస్టయిన నిందితుల వివరాలు, మహిళ పోస్ట్‌మార్టం నివేదిక కాపీని అందజేయాలని స్వాతి మలివాల్ ఔటర్ ఢిల్లీలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు రాసిన లేఖలో ఢిల్లీ పోలీసులను కోరారు. ఈ కేసులో లైంగిక వేధింపుల కోణం, బాలికను ఢీకొన్న కారు మార్గంలో పోలీసు చెక్‌పోస్టుల జాబితా, కారును ఎవరైనా పోలీసు సిబ్బంది ఆపారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారా? అని డిసిడబ్ల్యు ఢిల్లీ పోలీసులను కోరింది. అమ్మాయిని అనేక కిలోమీటర్లు ఈడ్చుకెళ్తున్నప్పుడు కారును పిసిఆర్ లేదా పోలీసు సిబ్బంది ఎందుకు ఆపలేదో వివరించాలని డిసిడబ్ల్యు చైర్‌పర్సన్ ఢిల్లీ పోలీసులను కోరారు. జనవరి 5వ తేదీలోగా తన సమన్లపై చర్య తీసుకున్న నివేదికతో స్పందించాలని ఢిల్లీ పోలీసులను కోరింది.