కిడ్నాప్ నాట‌క‌మాడిన బీ ఫార్మ‌సీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

Ghatkesar B Pharmacy Student Commits Suicide. ఇటీవ‌ల కిడ్నాప్ నాట‌క‌మాడిన బీ ఫార్మ‌సీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య పాల్ప‌డింది. నిద్ర మాత్ర‌లు మింగి

By Medi Samrat  Published on  24 Feb 2021 12:02 PM IST
Ghatkesar B Pharmacy Student Commits Suicide

ఇటీవ‌ల కిడ్నాప్ నాట‌క‌మాడిన బీ ఫార్మ‌సీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య పాల్ప‌డింది. నిద్ర మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కిడ్నాప్ నాట‌కం వెలుగు చూసిన త‌ర్వాత యువ‌తి మేన‌మామ ఇంట్లో ఉంటుంది. ఈ క్ర‌మంలో నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో యువ‌తి కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

కిడ్నాప్.. అంతా ఓ డ్రామా..

మేడ్చ‌ల్ ప‌రిధిలోని ఓ క‌ళాశాల‌లో విద్యార్థిని బీ పార్మసీ(19) ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతోంది. ప‌ది రోజుల క్రితం స‌ద‌రు యువ‌తి రాంప‌ల్లి చౌర‌స్తా వ‌ద్ద బ‌స్సు దిగి అక్క‌డి 1.5 కిమీ దూరంలో ఉన్న ఆర్ఎల్ న‌‌గ‌ర్‌లోని వెళ్ల‌కుండా త‌న స్నేహితుడితో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లింది. త‌ల్లి ప‌దే ప‌దే ఫోన్ చేయ‌డంతో.. త‌న‌ను ఆటో డ్రైవ‌ర్ కిడ్నాప్ చేశాడ‌ని త‌ల్లికి చెప్పింది. దీంతో భ‌య‌డిన ఆమె త‌ల్లి వెంట‌నే బంధువుల‌కు తెలుప‌గా.. వారు వెంట‌నే డ‌య‌ల్ 100కు స‌మాచారం ఇచ్చారు. యువ‌తి కిడ్నాప్‌తో వెంట‌నే అలర్ట్ అయిన పోలీసులు బృందాలుగా ఏర్పడి యువ‌తి కోసం గాలింపు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో రోడ్డు ప‌క్క‌న యువ‌తి అప‌స్మార‌క స్థితిలో పోలీసుల‌కు క‌నిపించింది.

వెంట‌నే పోలీసులు ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. అక్క‌డ ఆ యువ‌తిని ప్ర‌శ్నించ‌గా.. త‌న‌ను ఆటో డ్రైవ‌ర్లు కిడ్నాప్ చేశార‌ని చెప్ప‌డంతో.. పోలీసులు ఆ దిశ‌గా ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప‌లువురు ఆటో డ్రైవ‌ర్లను అదుపులోకి ప్ర‌శ్నించారు. అయితే.. సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేసే క్ర‌మంలో పోలీసులు అస‌లు నిజం తెలిసింది. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ ఆటో డ్రైవర్లకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధమూ లేదని గుర్తించారు. సీసీటీవీ ఆధారంగా అస‌లు ఆ విద్యార్థిని ఎవ‌రూ కిడ్నాప్ చేయ‌లేద‌ని గుర్తించారు. కాలేజీ వదిలిన తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు ఘట్‌కేసర్, యంనంపేట, అన్నోజీగూడ తదితర ప్రాంతాల్లో యువతి ఒంటరిగానే సంచరించినట్టు పోలీసులు గుర్తించారు.

ఆ స‌మ‌యంలో నిందితులుగా అనుమానించిన ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్ సంకేతాలేవీ ఆ ప్రాంతంలో లేవు. దీంతో బాధిత యువ‌తిని మ‌రోసారి ప్ర‌శ్నించ‌గా.. అస‌లు విష‌యం చెప్పింది. చీక‌టి ప‌డినా ఇంటికి ఇంకా ఎందుకు రాలేదంటూ త‌ల్లి ప‌దే ప‌దే ఫోన్లు చేయ‌డంతో.. ఆటో డ్రైవ‌ర్లు ఎక్క‌డికో తీసుకెళ్లార‌ని చెప్పిన‌ట్లు యువ‌తి చెప్ప‌డంతో పోలీసులు ఖంగుతిన్నారు. ప్ర‌స్తుతం ఈ కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న క్ర‌మంలో భ‌యంతో యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.



Next Story