దేశ రాజధాని ఢిల్లీలోని దయాల్‌పూర్‌లో పెళ్లికి నిరాకరించినందుకు యువతి తండ్రి షౌకీన్ ను ఇంతియాజ్ అనే యువకుడు కాల్చిచంపాడు. కాల్చిన అనంతరం ఇంతియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించగా ఇరుగుపొరుగు వారు అతడిని పట్టుకుని తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. మరణించిన వ్యక్తి జంక్‌యార్డ్ లో పనిచేసేవాడు. కాల్పులు జరిపిన వ్యక్తి అతనికి బంధువు అవుతాడు. షౌకీన్ కూతురితో పెళ్లి చేయాలని చాలా కాలంగా పట్టుబడుతున్నాడు. తరచూ ఫోన్ చేసి బాలికను వేధించేవాడు. బాలిక కుటుంబ సభ్యులు ఇంతియాజ్‌కు పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా అతడు పట్టించుకోలేదు. ఈ ఘటనకు ఒకరోజు ముందు ఫిబ్రవరి 15న ఇంతియాజ్ బాలిక తండ్రి షౌకీన్‌ను కూడా చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాతి రోజు ఇంతియాజ్ బాలిక ఇంటికి వెళ్లి మీతో మాట్లాడాలని తండ్రిని డాబాపైకి పిలిచాడు.
షౌకీన్ టెర్రస్‌పైకి రాగానే ఇంతియాజ్ పెళ్లి చేయాల్సిందేనని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీనికి బాలిక తండ్రి నిరాకరించారు. దీంతో ఆగ్రహంతో నిందితుడు ముందుగా తెచ్చుకున్న పిస్టల్‌ను తీసి షౌకీన్ నుదిటిపై పెట్టి కాల్పులు జరిపాడు. తల కింది భాగంలో కాల్చిన వెంటనే షౌకీన్ కిందపడిపోయాడు. ఇంతియాజ్ కాల్చి పారిపోయేందుకు ప్రయత్నించగా మెట్లపై నుంచి జారిపడిపోయాడు. దీంతో అతడు గాయపడ్డాడు. కాల్పుల శబ్దం విన్న ఇరుగుపొరుగు వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతియాజ్‌ను తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంతియాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.