జర్మన్ యువతిపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్‌

నిన్న మీర్‌పేట్ పీఎస్‌ పరిధిలో జర్మన్‌ యువతిపై అత్యాచారానికి పాల్ప‌డ్డ‌ క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat
Published on : 1 April 2025 7:45 PM IST

జర్మన్ యువతిపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్‌

హైద‌రాబాద్ : నిన్న మీర్‌పేట్ పీఎస్‌ పరిధిలో జర్మన్‌ యువతిపై అత్యాచారానికి పాల్ప‌డ్డ‌ క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివ‌రాళ్లోకెళితే.. మార్చి తొలివారంలో జర్మన్ యువతి, యువకుడు వెకేషన్ కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఇక్క‌డ వారు స్నేహితుడి ఇంట్లో ఉంటూ నగరాన్ని సందర్శిస్తున్నారు. నిన్న మార్కెట్‌ చూసేందుకు బయటకు వచ్చారు. ఆ స‌మ‌యంలోనే మీర్‌పేట్ సమీపంలో జర్మన్ యువతిని, యువకుడిని నిందితుడు అస్లాం, అతడి స్నేహితులు చూశారు. ఆ స‌మ‌యంలోనే క్యాబ్ డ్రైవర్ అస్లాం మనసులో యువ‌తి ప‌ట్ల‌ దుర్బుద్ధి పుట్టింది. దీంతో అస్లాం నగరాన్ని చూపిస్తానని మాయమాటలు చెప్పి జర్మన్‌ యువతి, యువకుడిని కారులో ఎక్కించుకున్నాడు. చెప్పిన‌ట్లుగానే వారిని సెల్ఫ్‌డ్రైవ్‌ కారులో పలు ప్రాంతాల్లో తిప్పాడు. స‌రిగ్గా రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కారును ఎయిర్‌ పోర్టు రోడ్డువైపు తీసుకెళ్లాడు. ఆ రోడ్డులో కొంత దూరం వెళ్లాక నిందితుడు అస్లాం స్నేహితులు, జర్మన్ యువకుడు ఫొటోలు దిగేందుకు కారు నుంచి దిగారు. ఇదే అదునుగా భావించిన నిందితుడు కారు యూటర్న్ చేసుకొని వ‌ద్దామని చెప్పి యువతిని కారులో తీసుకెళ్లాడు. కారును వేగంగా నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారంయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు యువ‌తిని పహాడి షరీఫ్ వద్ద వదిలి పారిపోయాడు. యువతి జరిగిందంతా స్నేహితుడికి చెప్పింది. అనంతరం బాధితురాలు స్నేహితుడితో కలిసి ఫహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేట్‌ల‌ను పరిశీలించి చివరకు నిందితుడు అస్లాంను అదుపులోకి తీసుకున్నారు.

Next Story