గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు దుర్మ‌ర‌ణం

Gas cylinder burst while cooking, 5 children of same family died. బీహార్‌లోని బంకా జిల్లా రాజోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం

By Medi Samrat  Published on  29 Dec 2021 9:39 PM IST
గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు దుర్మ‌ర‌ణం

బీహార్‌లోని బంకా జిల్లా రాజోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మంగళవారం సాయంత్రం రాజబార్ గ్రామానికి చెందిన అశోక్ పాశ్వాన్ ఇంట్లో వంట వండుతుండ‌గా.. గ్యాస్ పైపు లీకేజీ కావడంతో ఒక్క‌సారిగా మంటలు చెలరేగి సిలిండర్ పేలింది. ఘ‌ట‌నా స‌మ‌యంలో పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటున్నారని తెలిపారు. ప్రమాదంలో ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఎల్‌పీజీ సిలిండర్‌ లీకేజీ వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాద వార్త తెలియగానే చుట్టుపక్కల ప్రజలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. శబ్ధం విని అక్కడికి చేరుకున్న గ్రామస్తులు గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. ఐదుగురు చిన్నారులు అప్ప‌టికే మృతి చెందారు. మృతుల్లో నలుగురు తోబుట్టువులు ఉన్నారని రాజోన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బిడి పాశ్వాన్ తెలిపారు.

మృతులలో అశోక్ పాశ్వాన్ కుమారుడు అంకుష్ కుమార్ (12), కుమార్తెలు సీమా కుమారి (8), సోనీ కుమారి (4), శివాని కుమారి (6)తో పాటు అన్షు కుమారి (7) ఉన్నట్లు ఆయన తెలిపారు. అన్షు అశోక్ సోదరుడు ప్రకాష్ పాశ్వాన్ కుమార్తె అని సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


Next Story