హైదరాబాద్ నగరంలోని నానాక్‌రామ్‌గూడలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా శిథిలమైంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలు అయిన వారిని స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు దాని శబ్దానికి ఉలిక్కిపడ్డారు.
నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అబ్బాస్, అతడి భార్య సౌషద్ అక్కడిక్కడే మృతి చెందగా కుమార్తె అయేషా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అబ్బాస్ కుటుంబం స్థానికంగా టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున యధావిధిగా గ్యాస్ వెలిగించడంతో అప్పటికే లీక్ అవడంతో పేలుడు జరిగి మంటలు వ్యాపించాయి.