Hyderabad : మార్నింగ్ వాక్‌కు వెళ్లి మృత్యువాత పడ్డ స్నేహితురాళ్లు

Friends who went for a morning walk and died. ఎంతో సంతోషంగా మార్నింగ్ వాక్ వెళ్లిన ఇద్దరు స్నేహితురాళ్లు మృత్యువాత పడిన సంఘటన

By Medi Samrat  Published on  30 July 2023 6:43 PM IST
Hyderabad : మార్నింగ్ వాక్‌కు వెళ్లి మృత్యువాత పడ్డ స్నేహితురాళ్లు

ఎంతో సంతోషంగా మార్నింగ్ వాక్ వెళ్లిన ఇద్దరు స్నేహితురాళ్లు మృత్యువాత పడిన సంఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రిసాల బజారుకు చెందిన రాధిక (48) అనే మహిళకు బొల్లారం కలాసిగూడ సాయి నగర్ కి చెందిన పొలం బాలమణి యాదవ్ (60) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ బొల్లారంలోని కంటోన్మెంట్ బోర్డ్ పార్క్ వద్దకు వాకింగ్‌కు వెళుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఈ ఇద్దరు స్నేహితులు కలిసి వాకింగ్‌కు బయలు దేరారు. మరికాసేపట్లో కంటోన్మెంట్ బోర్డ్ పార్క్ లోపలికి చేరుకుంటారు. ఈ క్రమంలోనే మృత్యువు వారిద్దరిని కబలించింది.

ఉప్పల్ కు చెందిన ఆదిత్య.. స్పోర్ట్స్ బైక్ మీద షామీర్‌పేట్‌లో రేస్ ఆడడానికి సికింద్రాబాద్ నుండి శామీర్పేట్ వైపుకు అతివేగంగా వెళ్తూ.. కంటోన్మెంట్ బోర్డు పార్కు వద్ద రాధిక, బాలమణి యాదవ్ లను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడిపోయారు. రాధిక అక్కడికక్కడే మృతిచెందగా.. బాలమణిని అంబులెన్స్ లో ఆసుప‌త్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసిటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. స్నేహితులిద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు నిండుకున్నాయి.


Next Story