రోడ్డు ప్రమాదాలు కట్టడి కావడం లేదు. నిత్యం ఏదో మూలన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం దిండిగుల్ జిల్లా వతలకుందు ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిల్లులో పనిచేసే ఉద్యోగులతో వెళ్తున్న వ్యాను, ప్రయాణికులతో వస్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 62 మంది గాయపడ్డారు.
గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మధురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.