ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు ఓ కారు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామం మామండూరు నేషనల్ హైవేపై జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళ, ఓ వ్యక్తి ఉన్నారు. కారు విశాఖపట్నం నుండి కాణిపాకం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులు విశాఖపట్నం జిల్లా వాసులుగా గుర్తించారు. కాగా ప్రమాద ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. కల్వకుర్తి మండలంలోని మార్చాల సమీపంలో ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక విద్యార్థినికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన అరవింద్(23), వర్ధిపట్లకు చెందిన శిరీష(20), మహబూబాబాద్‌కు చెందిన కిరణ్మయి(22), మిర్యాలగూడకు చెందిన రేణుకలు హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో చదువుతున్నారు. గురువారం వెల్దండ మండలం బండోనిపల్లి గ్రామంలో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరై రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో యాక్సిడెంట్ జరిగింది.