సైబర్ మోసాలు ఎంతో మందిని ఆర్థికంగా దిగజారిపోయేలా చేయడమే కాకుండా.. మరెంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇంకొందరు ప్రాణాలను కూడా తీసుకుంటూ ఉన్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) అమర్ సింగ్ చాహల్ ప్రాణాలు పోయాయి. సైబర్ మోసంలో రూ.8.10 కోట్లు నష్టపోయిన ఆయన, తీవ్ర మనస్తాపంతో తన నివాసంలో తుపాకీతో కాల్చుకున్నారు.
పాటియాలాలోని తన నివాసంలో సెక్యూరిటీ గార్డుకు చెందిన రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నట్లు పోలీసులు నివేదించారు. ఘటనా స్థలం నుంచి 12 నుంచి 16 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీజీపీ గౌరవ్ యాదవ్‌ను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో, తాను మోసపోయిన తీరును, ఆర్థిక ఇబ్బందులను ఆయన వివరించారు. గత అక్టోబర్‌లో ఓ మోసపూరిత కంపెనీలో చాహల్ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. మొదట తన సొంత డబ్బు రూ.1 కోటి పెట్టుబడిగా పెట్టగా, ఆ తర్వాత కంపెనీ డిమాండ్ల మేరకు స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు చేసి మిగతా మొత్తాన్ని చెల్లించారు. చివరికి మోసపోయానని తెలుసుకున్న ఆయన ప్రాణాలను వదిలేశారు. ఈ మోసంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కూడా ఆయన లేఖలు రాసినట్లు సమాచారం.