ఘోర రోడ్డు ప్రమాదం.. డ్యూటీలో ఉన్న ఐదుగురు పోలీసులు దుర్మ‌ర‌ణం

ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

By -  Medi Samrat
Published on : 22 Feb 2026 9:06 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. డ్యూటీలో ఉన్న ఐదుగురు పోలీసులు దుర్మ‌ర‌ణం

ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మూలాల నుండి అందిన సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగింది. సరిగ్గా ఝర్సుగూడ సదర్ పోలీస్ స్టేషన్ ముందు పోలీసు పిసిఆర్ వ్యాన్ (బొలెరో) వాహ‌నాన్ని వేగంగా వస్తున్న ఐచ‌ర్(మినీ ట్ర‌క్కు) ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

వేగంగా ఢీకొనడం వల్ల పోలీసు వాహనం ముక్కలైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో దెబ్బతిన్న వాహనాన్ని తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు పోలీసులను వెంటనే జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.

వీరమరణం పొందిన పోలీసులలో డ్రిల్ సబ్-ఇన్‌స్పెక్టర్ నిరంజన్ కుజూర్, హవల్దార్ లింగరాజ్ ధురువా, ARకు చెందిన‌ కాశీరామ్ భోయ్, దేబ్దత్ సా, హోంగార్డు భక్రబంధు మిర్ధా ఉన్నారు. వీరంతా డ్యూటీలో ఉండగా ఎదురుగా వస్తున్న ఐచ‌ర్ వాహ‌నం అదుపుతప్పి ఢీ కొట్టింది.

జార్సుగూడ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వాహ‌నాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సంతాపం వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.

Next Story