షాకింగ్ ఘ‌ట‌న‌.. ఒకే ఇంట్లో ఐదు మృత‌దేహాలు

Five Of Family, Including 3 Children, Found Dead In Kerala's Kannur. కేరళలోని కన్నూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.

By Medi Samrat  Published on  24 May 2023 12:08 PM IST
షాకింగ్ ఘ‌ట‌న‌.. ఒకే ఇంట్లో ఐదు మృత‌దేహాలు

కేరళలోని కన్నూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఇంట్లో నిర్జీవంగా కనిపించారు. ఇంట్లో పెద్ద సంఖ్యలో మృతదేహాలు కనిపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఘ‌ట‌న‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంచలన ఉదంతం కన్నూర్ జిల్లా చెర్పుజలో చోటుచేసుకుంది. చెర్పుజాలోని ఒక ఇంట్లో ఐదుగురు కుటుంబీకులు నివసిస్తున్నారు. బుధవారం ఉదయం ఇంట్లో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురి మృతదేహాలు లభ్యం కావడంతో కలకలం రేగింది. త్వరితగతిన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి తరలించారు.

ప్రాథమిక విచారణ ప్రకారం ఇది హత్య, ఆత్మహత్యగా తెలుస్తోంది. దంపతులు తొలుత ముగ్గురు పిల్లలను హతమార్చి, ఆపై వారు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. మే 23-24 రాత్రి ఈ ఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ ఘ‌ట‌న‌పై విచారణ జరుగుతోంది.


Next Story