శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. రైలు ఢీకొని ఐదుగురు మృతి.. సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

Five Killed As Train Runs Over Them In Srikakulam.శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది. రైలు ఢీకొని ఐదుగురు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2022 3:08 AM GMT
శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. రైలు ఢీకొని ఐదుగురు మృతి.. సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది. రైలు ఢీకొని ఐదుగురు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. జి.సింగ‌డాం మండ‌లం బాతువ – చీపురుపల్లి రైల్వే స్టేషన్ మధ్య ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. కోయంబత్తూరు నుంచి సిల్చార్‌ వెళుతున్న గౌహ‌తి ఎక్స్‌ప్రెస్ సాంకేతిక కార‌ణాల‌తో బాతువ గ్రామ సమీపంలో రాత్రి 8.30 గంటల సమయంలో నిలిచిపోయింది. రైలు ఆగిపోవ‌డంతో కొంద‌రు ప్ర‌యాణీకులు రైలు దిగి ప‌క్క ట్రాక్‌పై నిలుచుని ఉన్నారు. సరిగ్గా ఆ స‌మ‌యంలో అదే ట్రాక్‌పై భువ‌నేశ్వ‌ర్ నుంచి ముంబై వెలుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకువ‌చ్చింది.

రైలును గ‌మ‌నించి ప‌క్క‌కు త‌ప్పుకునేలోపే ఘోరం జ‌రిగిపోయింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ప‌లువురి ఢీ కొట్టింది. దీంతో అక్క‌డున్న ప‌లువురు చెల్లాచెదుర‌య్యారు. ఐదుగురు ఘ‌ట‌నాస్థ‌లంలోనే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల్లో ముగ్గురిని అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం విజయనగరం ఎంఆర్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు‌ చేసిన‌ ‌పోలీసులు వివిధ కోణాల్లో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రైలులో పొగలు రావడంతో చైన్ లాగి దిగటానికి ప్రయత్నించారా? లేదా సాంకేతిక కారణాలతోనే గౌహతి ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయిందా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌మాదం ఎలా జ‌రిగింది అన్న వివ‌రాల‌ను అధికారులు సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించారు.

Next Story