మృతదేహం తరలిస్తుండగా ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
Five killed as ambulance hits truck due to dense fog. అసలే ఇంట్లో వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో వుండగా మృతదేహం తరలిస్తుండగా ప్రమాదం.
By Medi Samrat Published on 26 Jan 2021 9:57 AM GMT
అసలే ఇంట్లో వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిపోయింది. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడం కోసం నలుగురు కుటుంబసభ్యులు బయలుదేరారు. అయితే ఆ కుటుంబాన్ని విధి మళ్లీ కాటేసింది. మృతదేహాంతో వారు ప్రయాణిస్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురి కావడంతో.. మృతుడి కుటుంబసభ్యులు నలుగురితోపాటు అంబులెన్స్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతిచెందాడు.
వివరాళ్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బదోహి జిల్లా గోపాల్‌గంజ్ ఏరియాలో మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌కు వలస వెళ్లింది. అక్కడ ఆ కుటుంబానికి యెందిన వ్యక్తి అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతిచెందగా.. కుటుంబసభ్యులు మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్‌లో స్వరాష్ట్రానికి బయలుదేరారు.
మంగళవారం ఉదయం యూపీలోని గోపాల్‌గంజ్ ఏరియాకు చేరుకునే సరిగా రోడ్డుపై దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉంది. సరిగ్గా వెలుతురు లేకపోవడంతో అంబులెన్స్ ముందు వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుడి వెంట ఉన్న అతని నలుగురు కుటుంబసభ్యులతోపాటు అంబులెన్స్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.