పోలీసు వేషంలో వెళ్లి.. ట్రక్కు డ్రైవర్ ను కిడ్నాప్ చేశారు

హర్యానా రాష్ట్రంలోని భివానీ జిల్లాలో పోలీసు యూనిఫాం ధరించి ట్రక్కు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి, అతనితో పాటూ ట్రక్కును లాక్కుని వెళ్ళిపోయిన ఐదుగురు వ్యక్తులను భివానీ పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  3 Aug 2024 1:30 PM GMT
పోలీసు వేషంలో వెళ్లి.. ట్రక్కు డ్రైవర్ ను కిడ్నాప్ చేశారు

హర్యానా రాష్ట్రంలోని భివానీ జిల్లాలో పోలీసు యూనిఫాం ధరించి ట్రక్కు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి, అతనితో పాటూ ట్రక్కును లాక్కుని వెళ్ళిపోయిన ఐదుగురు వ్యక్తులను భివానీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచామని, వారిని రెండు రోజుల పోలీసు కస్టడీకి పంపామని భివానీ పోలీసు ప్రతినిధి తెలిపారు. నిందితుల నుంచి ట్రక్కు, పిస్టల్, రూ. 12,000, రెండు పోలీసు యూనిఫారాలు, నేరానికి ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తోషమ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు భివానీ పోలీసు సూపరింటెండెంట్ వరుణ్ సింగ్లా తెలిపారు.

జింద్‌కు చెందిన డ్రైవర్ సోను ట్రక్కుతో జూలై 26న నిర్మాణ సామగ్రితో తోషమ్ నుండి హన్సికి వెళ్తున్నప్పుడు రాటేరా సమీపంలోకి రాగానే వాహనంలో కొందరు వ్యక్తులు వెంబడించారు. ఇద్దరు వ్యక్తులు పోలీసు యూనిఫాం ధరించి వాహనం నుండి దిగారు. ట్రక్కుకు సంబంధించిన పత్రాలను తమకు చూపించమని అడిగారు.. ఆ తర్వాత నిందితులు మరికొందరితో కలిసి డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి తమ కారులో తీసుకెళ్లి అతనిని దూరంగా విడిచిపెట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు బాధితుడు. దీంతో నిందితులను ట్రేస్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. భివానీ, హిస్సార్ జిల్లాలకు చెందిన నిందితులను ఎట్టకేలకు పట్టుకోగలిగారు. నిందితులను సరల్ గ్రామానికి చెందిన విక్రమ్‌జీత్, భివానీలోని ఖానాక్ గ్రామానికి చెందిన జై భగవాన్, హిస్సార్ జిల్లాకు చెందిన వినోద్, పంకజ్, రోహతాస్‌లుగా గుర్తించారు.

Next Story