గుజరాత్‌లోని భారూచ్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. జగదీయలోని యుపీఎల్ సంస్థ ప్లాంట్-5లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన పేలుడుతో భారీగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
ప్లాంట్‌లో జరిగిన ఈ పేలుడు ధాటికి దాదాపు 15 కిలోమీటర్ల వరకు ప్రకంపనలు వచ్చాయి. చుట్టు పక్కల గ్రామాలైన దాధేరా, ఫుల్వాడి, కార్ల్సాడి ఇళ్ల కిటికీలపై ఉన్న అద్దాలు పగిలిపోయాయి. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. మంటల కారణంగా, భారీగా పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. పేలుడుకు గల కారణాలు తెలియాల్సివుంది. ఆరోగ్య, జిల్లా పరిపాలన ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలోని పటేల్ గ్రూప్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. అప్పటి ఆ ఘటనలో 10 మంది వరకూ మృతి చెందారు.