మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘట్ కేసర్ సమీపంలోని ఘనపూర్ వద్ద ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డుపై ఎర్టిగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే సజీవ దహనం అయ్యారు. మంటల్లో మృతిచెందిన వ్యక్తిని నారపల్లికి చెందిన శ్రీరామ్ (26) గా గుర్తించారు. శ్రీరామ్ హోల్ సేల్ సైకిల్ షాప్ నిర్వహిస్తాడని స్థానికులు తెలిపారు. మంటల్లో మృతి చెందిన అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘట్ కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మార్గం నుండి అబ్దుల్లాపూర్ మెట్ వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వాహన దారులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.