5వ తరగతి విద్యార్థిని ఆత్మ‌హత్య‌.. ఆ గ్రామంలో 30 రోజుల్లో 10వ మ‌ర‌ణం.. భ‌యంలో గ్రామ‌స్తులు

కొత్త‌గూడెం జిల్లాలోని సుజాత నగర్ మండలం గరీబ్‌పేట గ్రామంలో 5వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది

By Medi Samrat
Published on : 12 July 2024 8:47 PM IST

5వ తరగతి విద్యార్థిని ఆత్మ‌హత్య‌.. ఆ గ్రామంలో 30 రోజుల్లో 10వ మ‌ర‌ణం.. భ‌యంలో గ్రామ‌స్తులు

కొత్త‌గూడెం జిల్లాలోని సుజాత నగర్ మండలం గరీబ్‌పేట గ్రామంలో 5వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బుర్ర లిడియా(12) జిల్లాలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ పొందినట్లు సమాచారం. పది రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె కోలుకున్న తర్వాత తిరిగి పాఠశాలకు వెళ్లమని తల్లి చెప్పింది. అయితే గురుకులంలో చదవడం ఇష్టం లేని బాలిక.. తల్లిదండ్రుల ఒత్తిడితో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా బాలిక మృతితో గ్రామంలో జరిగిన ఓ వింత వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. 30 రోజుల వ్యవధిలో పది మంది మరణించారు, వారిలో ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు, ఏడుగురు అనారోగ్యంతో మరణించారు. గ్రామంలో ఈ వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి.

గత 24 గంటల్లో ముగ్గురు వ్యక్తులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఒకరిని కుటుంబ సభ్యులు రక్షించగా.. మిగిలిన వారు మరణించారని గ్రామస్తులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా గ్రామస్థుడు జి సైదులు (60) బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని.. గురువారం అతని అంత్యక్రియలు నిర్వహించామని.. ఆ త‌ర్వాత‌ బాలిక లిడియా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

వరుస మరణాలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి ఏదో చెడు జరుగుతోందని గ్రామ‌స్తులు భయపడుతున్నారు. అయితే పరిస్థితిని అధిగమించడానికి శాంతి పూజ, ఇతర పరిష్కారాలను కొందరు సూచించారు.

Next Story