చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విషాద ఘటన చోటు చేసుకుంది. వాలంటీర్‌గా పని చేస్తున్న ఉమా మహేశ్వరి (21) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కైలాసం నగర్‌లో జరిగింది. మృతురాలు సాంబశివరావు, నాగిని దంపతుల కుమార్తె ఉమా మహేశ్వరిగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉమా మహేశ్వరిని పెళ్లి చేసుకుంటానని పట్టణంలో వన్ టౌన్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్.. నమ్మించి మోసం చేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాంబశివరావు కుటుంబంలో వివాదాలు చెలరేగాయి.
దీంతో బాబి దగ్గర పంచాయతీ పెట్టగా.. తనను పెళ్లి చేసుకోవాలని కానిస్టేబుల్‌ను యువతి నిలదీసింది. అదే సమయంలో యువతి తండ్రి సాంబశివరావుపై కానిస్టేబుల్ ప్రసాద్ చేయి చేసుకున్నాడు. దీంతో అవమానం భరించలేక మానసిక వేదనకు గురైన యువతి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.