ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత అనే మహిళా కానిస్టేబుల్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తుంది. అయితే తనను పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతూ, డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయాలని, వేరే ఎవరితో చనువుగా మాట్లాడవద్దని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ అనే దూరపు బంధువు వేధింపులకు పాల్పడ్డాడు.
దీంతో రాజేందర్ వైఖరి నచ్చక అతనితో తమ కూతురు వివాహానికి అనిత తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ క్రమంలో అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని, తనను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందని రాజేందర్ గుర్తించాడు. ఈ క్రమంలో రాజేందర్ జబ్బార్ లాల్‌కు ఫోన్ చేసి, అనిత గురించి తప్పుడు సమాచారమివ్వడంతో జబ్బార్‌లాల్ అనితను వేధించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని అనితపై జబ్బార్ లాల్ వేధింపులకు దిగాడు.
ఈ నేపథ్యంలో రాజేందర్‌కు ఫోన్ చేసిన అనిత వారిద్దరి కారణంగా తన జీవితం నాశనమైందని ఆవేదన చెందింది. ఫోన్‌లో మాట్లాడిన అనితను ఆత్మహత్యకు ప్రేరేపించేలా రాజేందర్ సమాధానం చెప్పడంతో ఆమె గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో రాజేందర్, జబ్బార్‌లాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.