మియాపూర్ బాలిక హత్య కేసులో తండ్రే నిందితుడు.. కోరిక తీర్చలేదనే కోపంతో..
మియాపూర్ బాలిక అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.
By Medi Samrat Published on 19 Jun 2024 12:51 PM GMTమియాపూర్ బాలిక అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. మృతిచెందిన బాలికను కన్న తండ్రే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండలం ఎల్లంపేట్ గ్రామం లక్ష్మణ్ తండాకు చెందిన నరేష్ దంపతులు.. 15 రోజుల క్రితం బ్రతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు వచ్చారు. నరేష్‌కు అంతకుముందే తాగుడు అలవాటు ఉంది. అశ్లీల వీడియోలు కూడా చూసేవాడు. ఈ క్రమంలోనే అతడి ఫోన్ డిస్ ప్లే కరాబ్ అవడంతో ఏం చేయాలో తోచక.. కూతురును నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని బలవంతపెట్టాడు. తండ్రి మాట విని బాలిక గట్టిగా అరిచింది. నీ వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బెదిరించింది. విషయం అంతా అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరిచింది. దీంతో నరేష్ కోపంతో నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి తన కూతురిని జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలికను హతమార్చాక ఆ ప్రాంతం నుండి బయటకు వచ్చేశాడు.
వారం రోజుల తర్వాత బాలిక మిస్సింగ్ మిస్టరీ బయటపడింది. తండ్రిపై అనుమానంతో తమదైన రీతిలో పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో నరేష్ 11 నిమిషాల వ్యవధిలోనే తన కుమార్తెను హత్య చేసినట్లు వెల్లడైంది. కూతురిని హత్య చేపిన అనంతరం అక్కడి నుండి వచ్చేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. కూతురు చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లినట్లు.. అలా వరుసగా మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూసి వచ్చినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
కూతురు మిస్సింగ్‌పై వారం రోజుల పాటు అసలు విషయం దాచిన నరేష్.. తన భార్యతో కలిసి కూతురు తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు.. నరేష్ వ్యవహారశైలిపై మొదటి నుంచి అనుమానం కలిగిందని వెల్లడించారు. అయితే.. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించే క్రమంలో నిందితుడు నరేష్ నడిగడ్డ తండాకు చెందిన ఓ పెద్దమనిషితో జరిగిన విషయం చెప్పి పోలీసుల ఎదుట సరెండర్ చేయాల్సిందిగా కోరడంతో.. ఆయన నిందితుడు నరేష్‌ను పోలీసులకు అప్పగించాడు. అప్పటికే పోలీసులు సేకరించిన ఆధారాలు.. విచారణలో నరేష్ వెల్లడించిన విషయాలు విస్తుగొలిపే విధంగా ఉన్నాయి. నాలుగు బృందాలతో పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించినట్లు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.