పేలిన నాటు పటాకులు.. తండ్రీ కొడుకులు మృతి..!
Father son killed as country made firecrackers explode. దీపావళి పండగ పూట తమిళనాడు రాష్ట్రంలోని కొట్టకుప్పం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. నాటు పటాకులు
By అంజి Published on 5 Nov 2021 4:30 PM ISTదీపావళి పండగ పూట తమిళనాడు రాష్ట్రంలోని కొట్టకుప్పం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. నాటు పటాకులు తీసుకొని స్కూటీపై తండ్రి కొడుకులు వెళ్తుండా అవి ఒక్కసారిగా పేలాయి. మార్గం మధ్యలోనే తండ్రీ కొడుకులు ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కలైనేషన్, భార్య, తన 8 ఏళ్ల కొడుకు ప్రదీశ్‌తో కలిసి అరియన్ కుప్పం విలేజ్ నివాసం ఉంటున్నాడు. దీపావళి పండగ వస్తుండడంతో భార్యను తన పుట్టినిల్లైన విల్లుపురం పరిధిలోని కూనిమేడుకు పంపించాడు. ఆ తర్వాత గురువారం రోజు నాటు పటాకులు కొనుగోలు చేసిన కలైనేషన్.. తన కొడుకుతో కలిసి స్కూటీపై అత్తగారింటికి బయల్దేరాడు.
మార్గం మధ్యలో సంచిలో ఉన్న టాపకులు పేలాయి. కొట్టకుప్పం పట్టణానికి చేరుకోగానే రన్నింగ్ స్కూటీలో నాటు పటాకులు పేలాయి. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ పేలుడుతో సమీపంలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీలో కలైనేశన్ స్కూటర్ నడుపుతుండగా కొడుకు బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నట్లు కనిపించింది. కొత్తకుప్పం సమీపంలో టపాకులు పేలడంతో ఇద్దరూ స్కూటీపై నుంచి 10-15 మీటర్ల దూరం వరకు కిందపడిపోయారని పోలీసులు తెలిపారు. కలైనేశన్ వాహనం సమీపంలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు వాహనదారులు గణేష్ (45), సయ్యద్ అహమ్మద్ (60), విజి ఆనంద్ (36) కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని పుదుచ్చేరిలోని జిప్మర్ ఆసుపత్రికి తరలించారు.
రాపిడి వల్ల కలిగే వేడి కారణంగా క్రాకర్లు పేలి ఉండవచ్చని పలువురు అంటున్నారు. ఈ ఘటనపై ఇండియన్ పీనల్ కోడ్, పేలుడు చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. దీపావళి రోజున క్రాకర్స్ పేల్చేందుకు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మద్రాస్ హైకోర్టు నిర్దేశించిన నిర్ణీత సమయాన్ని ఉల్లంఘించిన వారిపై చెన్నై పోలీసులు 700 కేసులు నమోదు చేశారు. నగరంలో క్రాకర్ షాపులను నిర్వహించేందుకు నిబంధనలను ఉల్లంఘించినందుకు దాదాపు 239 మంది దుకాణదారులపై కేసు నమోదు చేశారు.