పిల్లిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన మ‌హిళ‌

పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఓ మహిళ తన ప్రాణాలను కోల్పోయింది. పక్క అపార్ట్ మెంట్ లో ఉన్న మహిళ వారించినా

By Medi Samrat  Published on  28 Nov 2023 2:04 PM
పిల్లిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన మ‌హిళ‌

పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఓ మహిళ తన ప్రాణాలను కోల్పోయింది. పక్క అపార్ట్ మెంట్ లో ఉన్న మహిళ వారించినావినిపించుకోకుండా.. బాల్కనీ దగ్గర పిల్లిని పట్టుకోడానికి ప్రయత్నించే సమయంలో పట్టుజారి కిందపడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయింది. కోల్ కతాలోని టోలిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన పెంపుడు పిల్లిని రక్షించేందుకు లేక్ అవెన్యూలోని తన అపార్ట్‌మెంట్ భవనం ఎనిమిదో అంతస్థుపై నుండి మహిళ కిందపడి చనిపోయింది. ఆమె ఇంట్లో పెంచుకుంటున్న మూడు పిల్లులలో ఒకదానిని కాపాడుకునే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

లేక్ వ్యూ అపార్ట్ మెంట్ లో అంజనా దాస్ తన తల్లితో కలిసి ఉంటోంది. వారి సొంత ఇంటికి రీమోడలింగ్ చేయిస్తుండడంతో లేక్ వ్యూ అపార్ట్ మెంట్ లో అద్దెకు దిగింది. తనతో పాటు తన పెంపుడు పిల్లులు మూడింటినీ తెచ్చుకుంది. వాటిలో రెండు పిల్లులు కనిపించకుండా పోయాయి. వాటికోసం అంజనా వెతుకుతోంది. సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ కోసం టెర్రస్ పైకి వెళ్లిన అంజనాకు టెర్రస్ కింద బాల్కనీ లాంటి ప్రాంతంలో చిక్కుకున్న పిల్లి కనిపించింది. దానిని కాపాడేందుకు అంజనా టెర్రస్ పై నుంచి కిందకు దిగింది. పిల్లిని చేరుకునే క్రమంలో ఆమె కాలు జారి 8 అంతస్తుల పై నుంచి కింద పడింది. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో అంజనాను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అంజనా చనిపోయిందని డాక్టర్లు ప్రకటించారు.

Next Story