భక్తుల, డబ్బులు దండుకుని బాలికలపై అత్యాచారానికి పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన 'నకిలీ' తాంత్రికుడిని ఓ యువతి సాయంతో ఎట్టకేలకు అజ్మీర్ పోలీసులు పట్టుకున్నారు. ఒక అమ్మాయి కొంత ధైర్యం ప్రదర్శించి, నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులకు సహాయం చేసింది. తనను తాను దేవుడిగా చెప్పుకునే రాజేంద్ర కుమార్ వాల్మీకిని అరెస్టు చేయడంలో ఆమె పోలీసులకు సహకరించింది.
ఎంతో మంది బాధితులు :
బంధువుల పెళ్లి కోసం ఢిల్లీ వెళ్లినట్లు 22 ఏళ్ల బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడ తన బంధువు ద్వారా నిందితుడితో పరిచయం ఏర్పడిందని అదనపు ఎస్పీ వికాస్ సగ్వాన్ తెలిపారు. ఆమె తన సమస్యల గురించి అతడితో మాట్లాడింది, ఆ తర్వాత అతను ఇంటిలో పూజలు చేయడానికి మొదటి విడతగా 1 లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. ఇంటిని సందర్శించినప్పుడు, ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పాడు. నకిలీ తాంత్రికుడు బాధితురాలి పెద్ద కుమార్తె తో ఒంటరిగా పూజలు చేయవలసి ఉంటుందని చెప్పాడు. నిందితుడు బాలికను పై అంతస్తులోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె అభ్యంతరం చెప్పడంతో చంపేస్తానని బెదిరించి దారుణానికి పాల్పడ్డాడు. గతంలో కూడా మరో బాధితురాలిపై నకిలీ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. అజ్మీర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఓ అమ్మాయి ద్వారా వల వేసి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.