Hyderabad : డ‌బ్బు కోసం ఇంట్లోకి చొర‌బ‌డి యువ‌తిని హత్య చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి

ఆన్‌లైన్ బెట్టింగ్, మద్యానికి అలవాటుపడి అప్పులు పాలైన యువకుడు డ‌బ్బు కోసం యువతిని హత్య చేసి ఆ సొమ్ముతో ఉడాయించాడు.

By -  Medi Samrat
Published on : 15 Nov 2025 4:42 PM IST

Hyderabad : డ‌బ్బు కోసం ఇంట్లోకి చొర‌బ‌డి యువ‌తిని హత్య చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి

ఆన్‌లైన్ బెట్టింగ్, మద్యానికి అలవాటుపడి అప్పులు పాలైన యువకుడు డ‌బ్బు కోసం యువతిని హత్య చేసి ఆ సొమ్ముతో ఉడాయించాడు. కాగా, నిందితుడైన‌ ఇంజనీరింగ్ విద్యార్థి శివ మాధ‌వ రెడ్డి(23)ని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఖమ్మం జిల్లాకు చెందిన దేవేందర్ రెడ్డి, నిహారిక(21) దంపతులు జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిది వెంకటేశ్వర నగర్‌లో నివాసముంటున్నారు. ఈ నెల 12వ తేదీన భర్త డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చేసరికి బాత్ రూంలో భార్య నిహారిక పడిపోయి ఉంది. దీంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ దృవీకరించారు. అనుమానంతో భర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో నిహారికది మర్డర్ అని తేలింది.

ఇంట్లో ఒంటరిగా ఉన్న నిహారికను నిందితుడు శివ మాధ‌వ రెడ్డి హ‌త్య చేసిన‌ట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిహారిక భర్త పనికి వెళ్లాడని.. పొరుగువారు లేరని నిర్ధారించుకుని వారి నివాసానికి వెళ్లాడు. ఆపై నిందితుడు ఆమె గొంతు కోసి చంపి బంగారు మంగళసూత్రం, ఒక జత బంగారు చెవిపోగులు, మూడు బంగారు ఉంగరాలు, బెడ్‌రూమ్ నుండి రూ. 2,500/- నగదును దొంగ‌లించి సహజ మరణంగా క్రియేట్ చేసి పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి దగ్గర నుండి పోలీసులు ఒక ద్విచక్ర వాహనం, 2 ఫోన్లు, దొంగిలించిన 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శివ మాధవ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు బాలానగర్ డీసీపీ వివరాలు వెల్లడించారు. ఈ కేసును చేధించిన జగద్గిరిగుట్ట పోలీసులు, SOT & CCS టీమ్‌ను DCP అభినందించారు.

Next Story