ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడింది. అనారోగ్య సమస్యలను తట్టుకోలేక ఆ జంట ఈ నిర్ణయం తీసుకుంది. వి.టి. అగ్రహారానికి చెందిన సత్యనారాయణ (60), ఆయన భార్య పార్వతి (55) గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యులు వారి సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ దంపతులు, ఇక బతకలేమని భావించారు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఉదయం ఎంతసేపటికీ తల్లిదండ్రులు గది నుంచి బయటకు రాకపోవడంతో వారి కుమారుడికి అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా, తల్లిదండ్రులు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నారు. వెంటనే స్థానికుల సహాయంతో కిటికీలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించాడు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పలువురికి కంటతడి పెట్టిస్తూ ఉంది.