ఒడిషా రాష్ట్రం సంబల్‌పూర్ జిల్లాలోని బెనియాపోషి కుసుమి గ్రామంలో 33 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో తన భార్యను హత్య చేశాడు. నిందితుడు గుణనిధి కిసాన్ తన భార్య రాధా కిసాన్ (31) పై వెదురు కర్రతో దాడి చేశాడు. ఆ తర్వాత గొడ్డలితో నరికాడు. రాధ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. "ఈ దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే తరచూ గొడవలు జరిగేవి. నిందితుడు మద్యం మత్తులో హత్య చేశాడు" అని కుచిండా సబ్-డివిజనల్ పోలీస్ అధికారి ప్రదీప్ కుమార్ దాష్ తెలిపారు. ఈసారి ఎందుకు గొడవ జరిగిందో నిందితుడి నుండి కూపీ లాగడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు.
మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు గుణనిధిని అరెస్టు చేసి, హత్యాకాండ జరిగిన ప్రదేశం నుండి హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సోమవారం కుచిండాలోని సబ్-డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.