దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని భరత్ నగర్ ప్రాంతంలో 30 ఏళ్ల పక్షవాతం ఉన్న వ్యక్తిని అతని తండ్రి కొట్టి చంపాడు. అజ్మీర్ సింగ్ అనే నిందితుడు మద్యం మత్తులో ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1.24 గంటల ప్రాంతంలో వజీర్‌పూర్ నివాసి అయిన పరంజీత్ అనే బాధితుడు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో దీప్ చంద్ బంధు ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ సంఘటన పోలీసులకు తెలిసింది. అయితే బాధితుడు తీవ్ర గాయాలపాలై మరణించాడు. అనంతరం అతని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి సోదరి రేఖ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆదివారం నాడు ఇంటికి తిరిగి వచ్చేసరికి పక్షవాతానికి గురైన తన సోదరుడు తీవ్ర గాయాలతో మంచంపై పడి ఉన్నాడని చెప్పింది.
మద్యం మత్తులో తండ్రి అజ్మీర్ సింగ్.. తన సోదరుడు పరంజీత్‌ను చెక్క కర్రతో కొట్టాడని రేఖ చెప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరంజీత్, అతని తండ్రి ఇంటి సమస్యలపై అప్పుడప్పుడు గొడవలు పడేవారు. రేఖ తన సోదరుడు పరంజీత్ గత 14 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నారని, రోడ్డు ప్రమాదం కారణంగా మంచానికి పరిమితం అయ్యారని పోలీసులకు చెప్పారు. మహిళ ఫిర్యాదు మేరకు భరత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 302 కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్-వెస్ట్) ఉషా రంగనాని తెలిపారు.