Hyderabad: రూ.45 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
హైదరాబాద్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను రాచకొండ పోలీసులు పట్టుకుని డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు.
By అంజి Published on 22 July 2024 5:30 PM ISTHyderabad: రూ.45 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
హైదరాబాద్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామం, కీసర వైపు వెళ్లే మల్కారం గ్రామ శివారు సమీపంలో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను రాచకొండ పోలీసులు పట్టుకుని డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. నిందితులు మధ్యప్రదేశ్‌లోని నీముచ్ నుండి హైదరాబాద్‌కు నిషిద్ధ డ్రగ్స్ (పప్పీ స్ట్రా, ఎండీఎంఏ)ను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. 40 కిలోల పప్పీ స్ట్రా, 10 గ్రాముల ఎండీఎంఏ, రూ.10 వేలు, మూడు మొబైల్ ఫోన్లు, వైఫై డాంగిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.45 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కేసు వివరాలు
సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి. సుధీర్‌బాబు తన కార్యాలయంలో మీడియా ముందు కేసు వివరాలను వెల్లడిస్తూ.. అరెస్టయిన ఇద్దరిని ఓమారామ్, సన్‌వాలా రామ్‌గా గుర్తించామని తెలిపారు. వీరిద్దరూ రాజస్థాన్‌కు చెందినవారు. వడ్రంగి, రైలింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నార్కోటిక్ డ్రగ్స్ అమ్మి సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.
కొన్ని నెలల క్రితం, వారికి మధ్యప్రదేశ్‌కు చెందిన వికాస్ అకా ముఖేష్ అనే డ్రగ్స్ సరఫరాదారుతో పరిచయం ఏర్పడిందని సీపీ తెలిపారు. అప్పటి నుండి, వారు ప్రజా రవాణా (బస్సులు, లారీలు, ఆటోలు మొదలైనవి) ద్వారా వికాస్ నుండి పప్పీ స్ట్రా, ఎండీఎంఏ కొనుగోలు చేసి హైదరాబాద్, చుట్టుపక్కల అవసరమైన వినియోగదారులకు విక్రయించడం ప్రారంభించారు.
ఆదివారం సాయంత్రం పక్కా సమాచారంతో ఎస్‌వోటీ ఎల్ బీ నగర్ బృందం, జవహర్ నగర్ పోలీసులతో కలిసి నిందితులను పట్టుకుని, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రిసీవర్లను గుర్తించి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకుని వినియోగదారులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సుధీర్ బాబు తెలిపారు.
ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 31A ప్రకారం నిషేధిత మాదక ద్రవ్యాలు, మాదకద్రవ్యాలను సేకరించడం, విక్రయించడం, రవాణా చేయడం, వినియోగించడం నేరమని, 10 సంవత్సరాల జైలు శిక్ష, మరణశిక్ష విధించబడుతుందని, ఈ ముప్పును అరికట్టడంలో పోలీసులకు సహకరించాలని సీపీ ప్రజలకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.