ర్యాపిడోలో 'చాక్లెట్' పార్శిల్, లోపల చూస్తే కొకైన్..గచ్చిబౌలి డ్రగ్స్ ముఠా స్కెచ్
భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది.
By - Knakam Karthik |
ర్యాపిడోలో 'చాక్లెట్' పార్శిల్, లోపల చూస్తే కొకైన్..గచ్చిబౌలి డ్రగ్స్ ముఠా స్కెచ్
హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఐటీ హబ్ గచ్చిబౌలి కేంద్రంగా సాగుతున్న భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను సైబరాబాద్ పోలీసులు (ఈగల్ టీమ్) ఛేదించారు. అత్యంత ఖరీదైన కొకైన్‌ను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 15 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మురళీ కృష్ణం రాజు అనే ప్రధాన నిందితుడితో పాటు వ్యాపారవేత్తలు చిరంజీవి వర్మ, హేమంత రాజు మరియు ఒక విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్ల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి, నగరంలోని సంపన్న వర్గాలకు భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
ఈ ముఠా డ్రగ్స్ రవాణా కోసం పక్కా ప్లాన్ అమలు చేస్తోంది. బెంగళూరు నుంచి జబ్బార్ ట్రావెల్స్ బస్సుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మురళీ కృష్ణ నేతృత్వంలోని ఈ ముఠా నగరంలోని 15 మంది ప్రముఖులకు నిరంతరం డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులకు దొరక్కుండా ఈ ముఠా అత్యంత నవీనమైన 'డెడ్ డ్రాప్' పద్ధతిని వాడుతోంది. నిందితులు డ్రగ్స్‌ను చాక్లెట్ గిఫ్ట్ ప్యాక్ మాదిరిగా ప్యాక్ చేస్తారు. కస్టమర్లు చెప్పిన లొకేషన్‌కు ర్యాపిడో ద్వారా పార్శిల్ పంపిస్తారు. డెలివరీ బాయ్‌కు కూడా అందులో ఏముందో తెలియకుండా, నేరుగా వినియోగదారులకు చేరేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ముఠా నెట్‌వర్క్‌లో ఉన్న ఆ 15 మంది ప్రముఖులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ వినియోగదారుల జాబితా బయటకు వస్తే మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.