Hyderabad: పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల మాఫియా కలకలం
పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల మాఫియా కలకలం సృష్టిస్తోంది
By - Knakam Karthik |
Hyderabad: పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల మాఫియా కలకలం
హైదరాబాద్: పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల మాఫియా కలకలం సృష్టిస్తోంది.అనస్థీషియా డ్రగ్స్‌ను మత్తుగా వినియోగిస్తూ యువకులు ప్రాణాలు కోల్పోతుండటంతో పోలీసులు అప్రమత్తమ య్యారు. ఇప్పటికే అనస్థీషియా మత్తు ఇంజక్షన్లు తీసుకున్న ముగ్గురు యువకులు మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. మత్తు ఇంజక్షన్ల ఓవర్‌డోస్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని స్పష్టం చేశారు.డబ్బుల కక్కుర్తితో కొందరు డాక్టర్లు అనస్థీషియా మత్తు ఇంజక్షన్లను అక్రమంగా అమ్ముతున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.
ఒక్కో ఇంజక్షన్‌ను వెయ్యి రూపాయల చొప్పున యువకులు కొనుగోలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, విద్యార్థులు ఈ డ్రగ్స్‌కు బానిసలవుతున్నట్లు గుర్తించారు. పోలీసుల ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ మత్తు మందుల దందా బయటపడింది. మత్తు ఇంజక్షన్లు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పలువురు యువకులు పట్టుబడ్డారు. పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ అక్రమ వ్యవహారం గుట్టు రట్టు అయ్యింది.ఈ కేసులో ఇప్పటికే అనస్థీషియా డ్రగ్స్ ఇంజక్షన్లు అమ్ముతున్న ఇద్దరు డాక్టర్లు, నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు ఇంజక్షన్ల సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.