దృశ్యం సినిమా తరహా హత్య.. నాలుగు సంవత్సరాల త‌ర్వాత‌ ఛేదించిన పోలీసులు

Drishyam-style murder in Ghaziabad. ఘజియాబాద్ పోలీసులు సోమవారం నాలుగు సంవత్సరాల నాటి కేసును ఛేదించారు.

By Medi Samrat  Published on  15 Nov 2022 6:15 PM IST
దృశ్యం సినిమా తరహా హత్య.. నాలుగు సంవత్సరాల త‌ర్వాత‌ ఛేదించిన పోలీసులు

ఘజియాబాద్ పోలీసులు సోమవారం నాలుగు సంవత్సరాల నాటి కేసును ఛేదించారు. 2018లో ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసులు మృతుడి భార్యను, ఆమెతో ఎఫైర్ పెట్టుకున్న‌ పొరుగు వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరి చేతిలో చంపబడిన వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి భార్య‌ మృతదేహాన్ని ఆమె ప్రియుడి ఇంట్లో పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

సిక్రోడ్ గ్రామానికి చెందిన బాధితుడు చంద్ర వీర్ సెప్టెంబరు 28, 2018న అదృశ్యమయ్యాడు. ఈ విష‌య‌మై సిహాని గేట్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. పోలీసులు ఎటువంటి పురోగతి సాధించకపోవడంతో.. చివరికి కేసును ముగించారు. అయితే.. తాజా ఇన్‌పుట్‌ల ఆధారంగా పోలీసులు ఇటీవల కేసును మళ్లీ తెరిచారు.

చంద్ర వీర్ భార్య సవిత వివాహానికి ముందు.. అరుణ్ అలియాస్ అనిల్ కుమార్‌తో సంబంధం కలిగి ఉంది. అది వివాహ‌నంత‌రం కూడా కొనసాగింది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. అరుణ్‌తో ఉన్న సంబంధం కార‌ణంగా చంద్ర వీర్ తనను కొట్టేవాడని సవిత చెప్పింది. సెప్టెంబర్ 28, 2018న చంద్ర వీర్ మత్తులో ఇంటికి తిరిగి వచ్చి నిద్రకు ఉపక్రమించాడు. సవిత అరుణ్‌ని తన ఇంటికి పిలిచింది. కంట్రీ మేడ్ పిస్టల్‌తో చంద్ర వీర్ తలపై కాల్చ‌గా అక్కడికక్కడే చనిపోయాడు.

నేరానికి ఉపయోగించిన పిస్టల్‌, గొయ్యి తవ్వేందుకు ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "అనిల్ ఇంటిలోని ఆరడుగుల లోతైన గొయ్యి నుండి అస్థిపంజరాన్ని వెలికితీశారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ (క్రైమ్) దీక్షా శర్మ ప్ర‌కారం.. DNA నమూనాలను పరీక్ష కోసం పంపిన‌ట్లు తెలిపారు.


Next Story