ఇటీవల కాలంలో చాలా మంది క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సమస్యకు పరిష్కారం ఆలోచించాల్సింది పోయి.. తాను లేకపోతేనే సమస్యకు పరిష్కారం అన్న స్థాయికి దిగజారుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ డాక్టర్ చేతికి విషం కలిపిన సెలైన్ బాటిల్ పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ రాజ్ కుమార్ (29) అమీర్‌పేట శ్యామ్‌కరణ్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ విధులు నిర్వహిస్తున్నాడు. బీకే గూడలో అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. డాక్టర్ రాజ్‌కుమార్ సొంతూరు కడప జిల్లా బద్వేలు. శుక్రవారం నాడు రాజ్ కుమార్ తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. తన మనసు ఏం బాగోలేదని చెప్పాడు.
ఆ తర్వాత ఫోన్ కట్ చేయగా.. తిరిగి తన స్నేహితుడు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానం రావడతో స్నేహితుడు వెంటనే మరో డాక్టర్ శ్రీకాంత్‌కు సమాచారం ఇచ్చాడు. అతను హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా.. రాజ్ కుమార్ తన చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకున్నాడు. అప్పటికే రాజ్‌కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హాస్పిటల్‌కి తీసుకెళ్లగా రాజ్‌కుమార్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. రాజ్‌కుమార్ తండ్రి కొండిపల్లి సుబ్బరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెలైన్ బాటిల్‌లో విషం కలిపి దాన్ని శరీరానికి ఎక్కించుకుని రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.