విజయవాడ ఆసుపత్రిలో దీపిక మరణం
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధినిర్వహణలో ఉన్న ఓ మెడికో అనుమానాస్పద రీతిలో మరణించింది.
By - Medi Samrat |
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధినిర్వహణలో ఉన్న ఓ మెడికో అనుమానాస్పద రీతిలో మరణించింది. విధుల్లో ఉండగానే కడుపునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పడంతో మరో వైద్య విద్యార్థిని ఇంజెక్షన్ చేసింది. ఆ తర్వాత ఆపరేషన్ గదిలో విద్యార్థిని మరణించినట్లు గుర్తించారు.
అనంతపురం జిల్లాకు చెందిన దీపిక ఎంబీబీఎస్ పూర్తిచేసి అనస్తీషియా విభాగంలో పీజీ చేస్తోంది. విజయవాడ వైద్య కళాశాలలో చదువుతున్న దీపిక విధుల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఆమె డ్యూటీ చేయాల్సి ఉంది. బుధవారం సాయంత్రం డ్యూటీకి వచ్చిన కాసేపటికే కడుపునొప్పిగా ఉందని తోటి వైద్య విద్యార్థులకు చెప్పింది. దీంతో ఓ విద్యార్థిని ఆమెకు ఇంజెక్షన్ చేసింది. ఆ తర్వాత విధుల్లో నిమగ్నమైన దీపిక రాత్రి 11.30 గంటల సమయంలో ఆపరేషన్ గదిలో బల్లపై పడిపోయింది. వెంటనే ఆమెను పరీక్షించిన సహచరులు దీపిక అప్పటికే మరణించిందని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించారు. దీపిక ఆత్మహత్యకు పాల్పడిందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.