భార్య ప్లాన్‌తో భర్తపై ప్రియుడి అటాక్..8 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూత

డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.

By Knakam Karthik  Published on  1 March 2025 10:10 AM IST
Crime News, Telangana, Warangal, Doctor

భార్య ప్లాన్‌తో భర్తపై ప్రియుడి అటాక్..8 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూత

వరంగల్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన డాక్టర్‌పై హత్యాయత్నం కేసు తెలిసిందే. ప్రియుడిపై మోజుతో డాక్టర్ అయిన భర్తను అంతం చేయాలనే పన్నాగంలో భాగంగా భార్య ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుమంత్ రెడ్డిని హత్య చేసేందుకు భార్య ఫ్లోరా ప్రియుడు సామ్యూల్‌తో కలిసి ప్లాన్ చేసింది. కాజీపేటలో ప్రైవేటు ఆసుపత్రిని నడుపుతున్న సుమంత్‌రెడ్డి రాత్రి విధులు ముగించుకొని కారులో ఇంటికి వస్తుండగా బట్టుపల్లి రోడ్‌లో కారు వెనుక భాగంలో సుత్తితో కొట్టారు. శబ్దం విన్న సుమంత్‌రెడ్డి కారును ఆపి బయటికి వచ్చి చూస్తుండగా అదే సుత్తితో పలుమార్లు అతని తలపై దాడి చేశారు. చనిపోయాడనుకుని పారిపోయారు. తీవ్ర రక్తస్రావమైన డాక్టర్ సుమంత్‌ రెడ్డిని స్థానికులు 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో.. తిరిగి వరంగల్‌కు తీసుకొచ్చారు.

వరంగల్‌ హంటర్‌ రోడ్డులోని వాసవీకాలనీలో నివాసముంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డికి 2016లో ఫ్లోరా మరియాతో లవ్ మ్యారేజ్ అయింది. తన బంధువల విద్యా సంస్థలను చూసుకునేందుకు 2018లో సుమంత్ రెడ్డి భార్యతో సహా సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యారు. అయితే అక్కడ ఫ్లోరా లెక్చరర్‌గా, సుమంత్ రెడ్డి పీహెచ్‌సీలో కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్‌గా చేరారు. సంగారెడ్డిలో జిమ్‌కు వెళ్తున్న క్రమంలో ట్రెయినర్ శామ్యూల్‌తో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ ఘటనపై మృతుడి తండ్రి సుధాకర్ రెడ్డి ఫిర్యాదుతో.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించారు. దాడి వెనుక వైద్యుడి భార్యతో పాటు ఆమె ప్రియుడు ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు.

Next Story