అక్రమాలను ప్రశ్నించిన వ్యక్తిని కారుతో గుద్ది చంపిన డీఎంకే నేత
తమిళనాడులో డీఎంకే నేత ఒకరు తన కారుతో ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లినందుకు అరెస్టయ్యారు.
By - Medi Samrat |
తమిళనాడులో డీఎంకే నేత ఒకరు తన కారుతో ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లినందుకు అరెస్టయ్యారు. నిందితుడి పేరు వినాయగం పళనిస్వామి అని తెలుస్తోంది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఆయన పంచాయతీ ప్రెసిడెంట్. మృతుడి పేరు కూడా పళనిస్వామేనని పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై వెళుతుండగా నిందితుడు మృతుడిని ఎస్‌యూవీతో గుద్దడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో డీఎంకే నాయకుడు మద్యం మత్తులో ఉన్నందున పోలీసులు మొదట దీనిని హిట్ అండ్ రన్ కేసుగా భావించారు.
తరువాత మృతుడి కుటుంబం ఘటనపై అనుమానం వ్యక్తం చేయడంతో విషయం బయటపడింది. మృతుడికి పంచాయతీ చీఫ్‌తో విభేదాలు ఉన్నాయని తెలిసింది. ఆ తర్వాత కేసును హత్యగా మార్చి పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకుంది.
ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ రోడ్డు పంచాయతీకి అప్పగించకపోవడంతో మృతుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో నిందితుడికి కోపం వచ్చింది. అలాగే.. పళనిస్వామి (మరణించిన) నిందితుడికి వ్యతిరేకంగా అనేక ఇతర సమస్యలను కూడా లేవనెత్తాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఇప్పుడు మొత్తం కేసును విచారిస్తున్నారు. అందులో భాగంగానే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఇదిలావుండగా.. డీఎంకే ప్రభుత్వంలో నేరాలు పెరిగిపోయాయని, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని తమిళనాడులోని ప్రతిపక్షాలు గత కొంత కాలంగా ఆరోపిస్తున్నాయి. అయితే, డీఎంకే మాత్రం రాష్ట్రంలో క్రైమ్ రేట్ అత్యల్పంగా ఉందని పేర్కొంది.