డెలివరీ బాయ్స్‌గా ఉంటారు.. ఆ తర్వాత ఏమి చేస్తారంటే?

వరుసగా వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on  3 Feb 2025 7:30 PM IST
డెలివరీ బాయ్స్‌గా ఉంటారు.. ఆ తర్వాత ఏమి చేస్తారంటే?

వరుసగా వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు రమేష్ బాబు అలియాస్ వినోద్, చంద్రమోలు గుండప్ప అలియాస్ అర్జున్ లను బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు.

అరెస్టయిన వారి వద్ద నుండి 4 లక్షల రూపాయల విలువైన అరడజను బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రమేష్ బాబు (27) గుండప్ప (24) డెలివరీ బాయ్‌లుగా పనిచేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సూరారం నివాసితులు. వీరితో పాటూ పి.నర్సింహ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు బాలానగర్ డీసీపీ కె.సురేష్ కుమార్ తెలిపారు

జనవరి 23, 2025 ఉదయం 8 గంటలకు, బాచుపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి కె. మహేష్ నుండి పోలీసులకు ఫిర్యాదు అందింది. అతను తన బైక్‌ను అమ్ముతున్నట్లు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన పోస్ట్ చేసానని, ఆ తర్వాత తనకు ఒక వ్యక్తి నుండి కాల్ వచ్చిందని తెలిపాడు. దానిని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నానని తెలిపాడు. అవతలి వ్యక్తి మహేష్ చిరునామాకు వచ్చి బైక్ కొంటాను ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తా అని చెప్పాడు. అయితే ఫోన్ చేసిన వ్యక్తి మహేష్ నుంచి బైక్ తీసుకుని పరారయ్యాడు. మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీలను పరిశీలిస్తుండగా కొట్టేసిన బైక్‌పై ప్రయాణిస్తున్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

బాచుపల్లిలో మూడు, మియాపూర్‌, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున అరడజను బైక్‌లను దొంగిలించినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. గుంటూరుకు చెందిన రమేష్ జీవనోపాధి కోసం 2018లో హైదరాబాద్‌కు వచ్చి ట్రాన్స్‌జెండర్‌తో ఉంటున్నాడు. 2023 సంవత్సరం వరకు బిర్యానీ పాయింట్, మొబైల్ సేల్స్ ఆండ్ సర్వీస్ షాపులను నడిపాడు. వ్యాపారంలో నష్టం రావడంతో వ్యాపారాన్ని వదిలేసి స్వగ్రామానికి చేరుకున్నాడు. 2024లో మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి సూరారంలో ఉంటూ బైక్‌ ట్యాక్సీ కెప్టెన్‌గా పనిచేస్తున్న సమయంలో గుండప్ప, నరసింహులతో రమేష్‌కు పరిచయం ఏర్పడింది.

ఆర్థిక సమస్యల కారణంగా అప్పులు తీర్చేందుకు సులువుగా డబ్బు సంపాదించేందుకు ఏదైనా దొంగతనం చేయాలని పథకం పన్నారు. ఓఎల్‌ఎక్స్ యాప్‌లో ప్రకటనను చూసి ఎవరైనా బైక్‌లు విక్రయిస్తున్నారా అని తనిఖీ చేస్తూ ఉండేవాళ్ళు. టెస్ట్ డ్రైవ్ పేరుతో వాహనాన్ని తీసుకుని తప్పించుకునేవారు.

Next Story