పూణేలోని కోంధ్వాలోని హోసింగ్ సొసైటీలో 22 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా నటిస్తూ నిందితుడు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో బాధితురాలి ఫ్లాట్‌లోకి ప్రవేశించి అత్యాచారానికి తెగబడ్డాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
పోలీసుల ప్రకారం, బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది, ఆమె సోదరుడు ఏదో పని మీద బయటకు వెళ్లాడు. నిందితుడు తనను తాను కొరియర్ డెలివరీ బాయ్‌గా పరిచయం చేసుకుని, బ్యాంకు నుండి సంతకం అవసరమయ్యే లేఖ వచ్చిందని చెప్పాడు. ఆమె తన దగ్గర పెన్ను లేదని సమాధానం చెప్పగా, తన దగ్గర కూడా లేదని అతను చెప్పాడు. ఆ మహిళ పెన్ను తీసుకోవడానికి తన బెడ్‌రూమ్‌కి వెళ్లగా, నిందితుడు ప్రధాన తలుపును లోపలి నుండి లాక్ చేసి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత అతను ఆ మహిళపై అత్యాచారం చేశాడు.
ప్రాథమిక నివేదికల ప్రకారం నిందితుడు ఆమెపై ఒక పదార్థాన్ని స్ప్రే చేశాడని. ఆమె స్పందించేలోపే స్పృహ కోల్పోయిందని పోలీసులు తెలిపారు. ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు, ఆమె ఫోన్‌లో "నేను మళ్ళీ వస్తాను" అని రాసి ఉన్న బెదిరింపు సందేశం కనిపించింది. నిందితుడు ఫోన్‌లో సెల్ఫీ కూడా తీసుకున్నాడు. సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందిన వెంటనే, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడిని పట్టుకోడానికి స్పెషల్ టీమ్స్ ను పోలీసులు ఏర్పాటు చేశారు.